సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే పదం నిత్యం చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది. సినీ సెలబ్రిటీల పిల్లలకే అవకాశాలు దక్కుతున్నాయంటూ ఈ నెపోటిజంపై పెద్ద పెద్ద ఉద్యమాలే నడిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెపోటిజంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఓపెన్ అయ్యారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ నెపోటిజం అనే అంశంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు అల్లు అరవింద్. ఇది ఏ రంగంలో లేదో గుండెల మీద చేయేసుకొని చెప్పండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్స్‌గా టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ వచ్చారు. బాలయ్య బాబు ఎదుట కూర్చొని ఆయన వేస్తున్న ప్రతి ప్రశ్నకు బదులిస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే నెపోటిజం అనే టాపిక్ రావడంతో అల్లు అరవింద్ ఓపెన్ అయ్యారు.
నెపోటిజంపై మీ అభిప్రాయాలు చెప్పండి అని బాలయ్య ప్రశ్నించడంతో వెంటనే రియాక్ట్ అయిన అల్లు అరవింద్.. నెపోటిజం అంటూ విమర్శలు గుప్పిస్తున్న వారు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాలి ఒకవేళ వారికే ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా? అని అన్నారు.
చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో అదే వృత్తిపై ఇంట్రెస్ట్ ఉండటం కామన్. అలాగే టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ చూపిన మార్గం ఎంచుకోవడంలో తప్పేమీ లేదుగా. అయినా డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మెన్, లాయర్స్ ఇలా అన్ని వృత్తుల్లో ఉన్నవారు తమ పిల్లలను అదే వృత్తిలో సెట్ చేయడం లేదా? మరి అది నెపోటిజం అనబడదా అంటూ అల్లు అరవింద్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ఈ తర్వాత మరో నిర్మాత సురేష్ బాబు కూడా ఇదే విషయమై తన అభిప్రాయం బయటపెట్టారు. నెపోటిజం అనేది కేవలం ఆరంభం మాత్రమే ఇస్తుంది. స్టార్ గా ఎదగాలంటే టాలెంట్ ఉండాల్సిందే. కేవలం వారసత్వం వల్లనే స్టార్స్ అవుతారు అనుకోవడం తప్పు అని అన్నారు దగ్గుబాటి సురేష్ బాబు.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నెపోటిజం అనేది ఓ హాట్ టాపిక్ అయింది. తెలుగు సినీ పరిశ్రమ పరంగా చూస్తే.. అల్లు ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి, అక్కినేని ఫ్యామిలీ నుంచి, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎవరెవరు హీరోలుగా ఎదిగారో మనందరికీ తెలిసిన విషయమే.
ఈ నేపథ్యంలో తాజాగా నెపోటిజం అనే దాన్ని బూతద్దం పెట్టి చూడొద్దన్నట్లుగా అల్లు అరవింద్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇలా మరోసారి సినీ వర్గాల్లో నెపోటిజం టాపిక్ చర్చల్లో నిలుస్తోంది.