తండ్రి మాట వినకండి.. బాగుపడండి అంటూ స్లోగన్ ఇస్తున్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈ మేరకు అయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బండ్ల గణేష్‌తో పాటు అల్లు అర్జున్ సోదరుడు బాబీ కూడా ఉన్నారు.
ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొన్న బండ్ల గణేష్.. అక్కడ అల్లు బాబీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అప్పుడే, కొన్ని నీతి వాఖ్యాలు చెప్పారు. తండ్రి మాట వింటే అల్లు బాబీలా అయిపోతారని.. అదే తండ్రి మాట వినకుండా తనకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్‌లా సూపర్ స్టార్ అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. ‘‘అందరికీ చెప్తున్నా.. తండ్రి మాట వినొద్దు. తండ్రిని గౌరవించి, తండ్రి మాట వింటే మా బాబీ గారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తే మా హీరో బన్నీ గారిలా అవుతారు. బాబీ గారు అవ్వాలా.. బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండి’’ అని వైరల్ వీడియోలో బండ్ల గణేష్ అంటున్నారు.
తండ్రి మాట విని కష్టపడి చదువుకుని మామూలుగా ఉన్నాడు కాబట్టి బాబీ ఇలా ఉండిపోయాడు. చిన్నప్పటి నుంచీ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్టు చేసిన బన్నీ గారు ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దయచేసి మీ అందరికీ చెబుతున్నా.. తండ్రి మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకొని బాగుపడండి. తండ్రి మాట విన్న వ్యక్తిని చూడండి.. వినని మా బన్నీని చూడండి’’ అని మరో వీడియోలో బండ్ల గణేష్ అన్నారు. ఈ మాటలకు అల్లు బాబీ పగలబడి నవ్వారు.
అయితే, పబ్లిక్‌లో బండ్ల గణేష్ ఇలా ఎలా మాట్లాడతారని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఇదేం మెసేజ్ అంటూ మండిపడుతున్నారు. తండ్రి మాట వినకుండా బన్నీ స్టార్ హీరో ఎలా అయిపోయాడంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే బండ్లన్న మాటలను లైట్ తీసుకుంటున్నారు. ఆయనకు ఇలా ఏదో ఒకటి మాట్లాడటం అలవాటేగా అంటూ నవ్వుకుంటున్నారు.
అన్నదమ్ములని పోల్చుతూ ఒకరిని పొగుడుతూ, మరొకరిని తక్కువ చేస్తూ మాట్లాడడం ఏంటి.. కామన్ సెన్స్ లేదా అంటూ బండ్ల గణేష్ పై ట్రోలింగ్ కి దిగుతున్నారు. బన్నీతో బండ్ల గణేష్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
ఇదేంది అన్నాయ్ @ganeshbandla pic.twitter.com/73pwWtPACj
— devipriya (@sairaaj44) December 4, 2022