ఊహించని విధంగా వచ్చిన ఇమేజ్ తో బన్నీ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. నెక్ట్స్ ఏ సినిమా చేయాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. దీనికి కారణం పుష్ప సినిమా నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే. అవును.. పుష్ప- ది రైజ్ సినిమా ఉత్తరాదిన పెద్ద హిట్టయింది. ఓవైపు ఓటీటీలో హిందీ వెర్షన్ లో పుష్ప అందుబాటులో ఉన్నప్పటికీ, థియేటర్లలో ఈ సినిమాను ఇంకా చూస్తున్నారు. అలా వంద కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పుష్ప సినిమా ఉత్తరాదిన దూసుకుపోతోంది.
ఈ సినిమా సక్సెస్ తో బన్నీ లైనప్ మొత్తం ఇప్పుడు సంశయంలో పడింది. పుష్ప-2 తర్వాత ఏ సినిమా చేయాలనే అంశంపై అల్లు అర్జున్ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. లిస్ట్ లో ఇద్దరు ముగ్గురు దర్శకులు ఉన్నప్పటికీ అందర్నీ పెండింగ్ లో పెట్టాడు ఈ హీరో.
పుష్ప-2 సినిమా నార్త్ లో సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది ఇప్పుడు అనవసరం. బన్నీకి పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసిందనేది వాస్తవం. ఇకపై అతడు తన ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవెల్లోనే డిజైన్ చేసుకోవాలి. అందుకే వేణు శ్రీరామ్, కొరటాల శివ లాంటి దర్శకుల సినిమాలపై బన్నీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.
వేణు శ్రీరామ్, కొరటాల సినిమాల్ని బన్నీ ఆల్రెడీ ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడీ సినిమాల్ని స్టార్ట్ చేస్తే, తన పాన్ ఇండియా ఇమేజ్ కు సరితూగుతాయా అనేది బన్నీ ఆలోచన. అందుకేనేమో.. తాజాగా అట్లీ, మురుగదాస్ లాంటి దర్శకుల పేర్లు తెరపైకొస్తున్నాయి. మొత్తమ్మీద బన్నీ మైండ్ సెట్ మారిందనేది తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అతడు పుష్ప-2 తర్వాత ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.