యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమా ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో తెలుసుగా. ఆ సినిమా బడ్జెట్ 350 కోట్లు. ఎక్కువ శాతం ఖర్చయింది యాక్షన్ సీన్స్ పైనే అని సినిమా చూసిన అందరికీ ఈజీగా తెలిసిపోయి ఉంటుంది. ఇక విడుదలయ్యాక ఎంత గొప్ప బ్యాడ్ టాక్ మూట గట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనకూ ఇలాంటి ఒక సినిమా కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో “అల వైకుంఠపురంలో” సినిమా సెట్స్ పై బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే యువ దర్శకుడు వేణు శ్రీరాం దర్శకత్వంలో “ఐకాన్” సినిమా షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. సదరు సినిమా కథ విని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. ఆ సినిమాను నిర్మాత దిల్ రాజు తెరకెక్కింస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఓ వార్త నిర్మాత దిల్ రాజునే కాకుండా, బన్నీ అభిమానులను సైతం కలవరపెడుతోంది.
ఐకాన్ సినిమా కథ మొత్తం ఒక బైక్ దొంగతనం చుట్టూ తిరుగుతుందట. ఆ కథలో వచ్చే సన్నివేశాల పరంగా ఓ రేంజ్ నుండి, భారీ బైక్ ఛేజింగ్ సీన్స్ ఉండబోతున్నట్టుగా సమాచారం. రీసెంట్ గా వచ్చిన సాహోలోని ఛేజింగ్ సన్నివేశాలు బహుశా బన్నీకి తెగ నచ్చేసినట్టున్నాయ్. అందుకనే ఇప్పుడు తన ఐకాన్ సినిమాలోని ఛేజెస్ కూడా ఆ రేంజ‌్‌లో రిచ్‌గా ఉంటే బాగుంటుందని దర్శకుడికి సలహా ఇచ్చాడని తెలుస్తోంది. ఆ రేంజ్ సీన్స్ చెయ్యాలంటే నిర్మాతకు తడిసి మోపెడవడం ఖాయం. అసలే దిల్ రాజు సినిమా నిర్మాణ ఖర్చుల్లో చాలా ఆచితూచి లెక్కలేసుకుని మరీ వ్యవహరిస్తాడు. ఇప్పుడు బన్నీ కోరిక విని ఆయన ఖంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. సాహో ఫలితం తెలిసిపోయింది కాబట్టి ఈ వార్తకు బన్నీ అభిమానులు సైతం కలవరపడుతున్నారు మరి.