సంక్రాంతి పందెం కోడి అల్లు అర్జున్ మాంచి జాతి వన్నె పుంజును చేతబట్టి బిగ్ స్క్రీన్ యుద్ధానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని 2020 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బన్నీకి సంబంధించి ఓ ఆసక్తికర పోస్టర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ ఓ చేతిలో వేట కొడవలి, మరో చేతిలో పందెం పుంజును పట్టుకొని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నట్లు సూపర్ ఫోజు ఇచ్చాడు.
సంక్రాంతి పల్లె సరదాల సందళ్ళు అల.. వైకుంఠపురములో ఉంటాయన్న సంకేతం పోస్టర్ ద్వారా తెలుస్తోంది. పక్కా మాస్ లుక్ లో ఉన్న హీరో అల్లు అర్జున్ అందాల నివాసం -అల.. వైకుంఠపురములోకి ఎందుకు ఎంటరయ్యాడు? అలకానందతో ఎలా జోడీ కుదిరింది? ఈ మూవీలో అల్లు అర్జున్ పక్కా పల్లెటూరి వాడా? లేక పట్నం నుంచి పల్లెకు కార్యసాధనకు వచ్చి మాస్ లుక్ లో అల.. వైకుంఠపురములో చేరిన ఆధునిక యువకుడా? అనే ప్రశ్నలు ఫాన్స్ తోపాటు ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ – బన్నీల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అల.. వైకుంఠపురములో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ రెండు చిత్రాల మాదిరిగానే సంక్రాంతి సక్సెస్ మూవీగా నిలుస్తుందన్న అంచనాలున్నాయి.