ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ కు ఊరట లభించింది. యూపీలో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను కస్టడీలో కొనసాగిచడం ఏ మాత్రమూ న్యాయం కాదంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
జుబేర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 20వేల విలువైన బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్ ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఆయనపై నమోదైన అన్ని కేసులనూ ఢిల్లీ స్పెషల్ పోలీస్ విభాగానికి సుప్రీం కోర్టు ట్రాన్స్ ఫర్ చేసింది. ట్వీట్లు చేయకుండా జుబేర్ ను ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని యూపీ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బొపన్నలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
ప్రభుత్వ కోరిక … ఓ న్యాయ వాదిని వాదనలు వినిపించ వద్దని, ఓ వ్యక్తిని మాట్లాడ వద్దని కోరినట్టు ఉందని ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తి ఏం చేసినా, దానికి అతను చట్టంలో బాధ్యుడిగా ఉంటాడని ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ఆ కథనాలు రాయవద్దంటూ ఆ జర్నలిస్టును తాము ఆదేశించబోమని వ్యాఖ్యానించింది.