టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకే మాత్రమే ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆమన్ గల్ మండలం మంగళ్ పల్లి గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి సహా టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియాతోపాటు ఇప్పుడు వైన్స్ మాఫియా స్టార్ట్ అయ్యిందన్నారు బండి సంజయ్. పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి వైన్స్ షాపులు పెట్టించి డబ్బు దండుకుంటున్నారని ఆరోపించారు. తాగు తాగించు, ఊగు ఊగించు, దంచుకో దుండుకో అనే మూడు కొత్త స్కీంలను కేసీఆర్ స్టార్ట్ చేశారన్నారు. వీటితో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొనాలనుకున్న “కేసీఆర్ ను హుజూరాబాద్ ప్రజలు చిత్తుగా ఓడించినా ఆయనకు ఇంకా బుద్దిరావడం లేదు. డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో రైతు చనిపోవడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణం. వానా కాలం పంట కొనకుండా రైతులను గోస పెడుతున్నారు కేసీఆర్. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గు చేటు. సమస్యలను సృష్టించి తన పాలనపట్ల ప్రజల దృష్టిని మళ్లించడంలో కేసీఆర్ నెంబర్ వన్. ఆయన తెలంగాణ నెంబర్ ద్రోహి. కేసీఆర్ చైనా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. చైనా విషయంలో సైనిక వీరుడు బిపిన్ రావత్ ఎంతగా తెగించి కొట్లాడిండో తెలుసుకోవాలి. అంత గొప్ప వీరుడు రావత్ గురించి చైనా దుష్ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో నీ సమాధానమేంటి? రాత్రి పూట నిర్ణయాలు తీసుకునే సీఎం ఈ ప్రపంచంలో కేసీఆర్ ఒక్కరే ఉంటారు”
అంటూ మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు ఎలాంటి అధికారాల్లేవన్నారు బండి. రోడ్డు శాంక్షన్ చేసే అధికారం లేని వ్యక్తి రోడ్ల, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారని.. హోంగార్డును కూడా బదిలీ చేయలేని నాయకుడు హోంమంత్రిగా కొనసాగుతున్నారంటూ విమర్శించారు. అన్ని అధికారాలు కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే ఉన్నాయన్నారు. మంత్రులంతా డమ్మీలుగా మారారని ఆరోపించారు. ఇక కల్వకుంట్ల కుటుంబం వాడుతున్న భాష సంస్కార హీనమన్న బండి… దేశమంతా వారు వాడుతున్న భాషను చూసి సిగ్గుపడుతోందని చెప్పారు.
అందరికీ అవకాశం ఇచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు సంజయ్. కేంద్రంలోని నరేంద్రమోడీ స్ఫూర్తితో తెలంగాణలోనూ అవినీతి మచ్చ లేని పాలన కొనసాగిస్తామని చెప్పారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనను తరిమికొట్టాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్న ఆయన.. రాష్ట్ర ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. అందుకే తెలంగాణ వాదులు, జర్నలిస్టులు బీజేపీలో చేరుతున్నారని గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతాన్ని, మోడీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీలో ఎగిరేది బీజేపీ జెండానేనని చెప్పారు బండి సంజయ్.