ఏపీ రాజధాని తరలిస్తున్నామన్న ప్రకటనలతో ఓ వ్యక్తి మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించిన ఘటన దొండపాడు గ్రామంలో జరిగింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి దొండపాడు గ్రామానికి చెందిన మల్లిఖార్జున రావు తీవ్ర ఆవేదనకు గురయ్యాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన స్థానికంగా నిర్వహించే ఆందోళనలో పాల్గొనేవాడని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోవడంతో మల్లిఖార్జున రావు గుండెపోటుతో మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మల్లిఖార్జున రావు మృతి చెందాడని తెలుసుకున్న రైతులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తుళ్లూరులో రైతులు నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ.. మల్లిఖార్జున రావు మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.