రాజధాని రైతుల ఆగ్రహాం సినిమా తారలకు తప్పేలా లేదు. ఓవైపు రాజధానిని అమరావతిలోనే కొనసాగించండంటూ ఉద్యమం తీవ్రమవుతున్నా… సినిమా తారలు మాత్రం స్పందించటం లేదు. పైగా రైతులపై కొందరు సినిమా వాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో రాజధాని రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా తారలు అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదు సామాజిక సృహా ఉండాలి, అందుకు ఉదాహరణ దీపికా పదుకొణే. బాలీవుడ్ రారాణిగా చలామణి అవుతున్నప్పటికీ జెన్‌యూలో విద్యార్థి సంఘం నాయకురాలిపై జరిగిన దాడి తెలుసుకొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. తమిళనాడులో రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. కానీ తెలుగు రైతుల కష్టాలు, బాధలు తెలుగు సినీ పరిశ్రమకు పట్టవా అంటూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న చిన్న అంశాలకే ట్విట్టర్‌లో, సామాజిక మాధ్యమాల్లో ప్రేమ ఒలకబోసే సినీ తారలు అమరావతి రైతుల రాజధాని ఉద్యమంపై ఎందుకు పెదవి విప్పటం లేదని ప్రశ్నిస్తున్నారు. మా పచ్చని భూములను ప్రభుత్వంపై నమ్మకంతో ఇచ్చాం, కానీ ఇప్పుడు రాజధాని లేదంటే మా పరిస్థితి ఏంటీ…? మా త్యాగానికి మీరిచ్చిన విలువ ఇదేనా…? రాజకీయ కక్షలకు రైతులను బలిచేస్తుంటే స్పందించాల్సిన కనీస బాధ్యత సినిమా రంగానికి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికీ సినిమా రంగ ప్రముఖులు స్పందించకుండా మాకెందుకులే అనుకుంటే ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమకారులు. సంక్రాంతి సినిమాలను అడ్డుకుంటాం, సినిమాలను చూసేందుకు ఎవరూ వెళ్లకూడదని పిలుపునిస్తాం… అప్పుడు కానీ మా బాధ వారికి అర్థం కాదంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాల విడుదలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కనీసం ఇప్పుడైనా సినీ పరిశ్రమ స్పందిస్తుందో లేదో చూడాలి.
Advertisements
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు