అమరావతి… గ్రీన్ ఫీల్డ్ సిటీగా పేరు సంపాదించుకుంటుంది, ఎంతో భవిష్యత్ ఉన్న నగరంగా మారబోతుందని మాజీ సీఎం చంద్రబాబు పదే పదే చెప్పేవారు. కానీ ఆ అమరావతి ఆలోచన చంద్రబాబుది కాదని… మాజీ సీఎం, జగన్ తండ్రి వైఎస్ ఆశయమని తెలుస్తోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే అమరావతి నగర నిర్మాణ ఆలోచనలకు పునాదులు పడ్డాయని, అమరావతి అనే పేరు మాత్రమే చంద్రబాబు పెట్టారన్న ఆధారాలు బయటకొచ్చాయి.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు-విజయవాడ మధ్య మెగాసిటీ ప్లాన్ చేశారు. 2007లో టువర్డ్స్ ప్లాన్డ్ డెవలప్‌మెంట్-2021 పేరుతో ఉడా ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి కలిపి వీజీటీఎం-ఉడాగా ఉండేది. అక్కడే ఈ ప్లాన్డ్ సిటీని నిర్మించాలనుకున్నారు. తర్వత చంద్రబాబు ఉడాను తీసేసి సీఆర్డీఏను తీసుకొచ్చారు. 2021కల్లా గుంటూరు-విజయవాడ మధ్య కొత్త నగరాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందులోనే ప్రస్తుత మందడం గ్రామంతో పాటు కొల్లిపర మండలం కూడా కలిసి ఉండేది. కానీ వైఎస్ చనిపోయాక ఆ కొత్త నగర నిర్మాణం అటకెక్కిపోయింది.
వైఎస్ ఆలోచనకు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు కార్యరూపం ఇచ్చారు. ఆ కొత్త నగరానికే అమరావతి అనే పేరు పెట్టారు. కానీ తండ్రి ఆశయాల కోసం మడమ తిప్పనంటూ వచ్చిన వైఎస్ జగన్ మాత్రం… తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనను చిదిమేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ అమరావతిని ఓ సామాజిక వర్గం పట్టణంగా అభివర్ణిస్తున్నారని విమర్శిస్తున్నారు.