నర్సింహా రెడ్డి
జర్నలిస్ట్
అమరావతి ఉద్యమం నేటికి 150 రోజులు పూర్తి చేసుకుంది. కరోనా సమయంలో కూడా అక్కడి రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మంచి నగర నిర్మాణం జరుగుతుంది, రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది అని నమ్మిన రైతులు అమ్మ లాంటి భూమిని త్యాగం చేశారు. నగరంగా అభివృద్ధి చెందితే తాము ఆర్థికంగా బలపడుతాం అని నమ్మిన రైతుల ఆశలపై నీళ్లు చల్లారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రంలో ఉన్న నేను కూడా మొన్నటిదాకా కలిసి ఉన్న తోటి తెలుగువాళ్లకు ఒక మంచి రాజధాని ఏర్పాటుకాబోతుంది. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక నగరం ఏర్పాటు అవుతుంది అని బలంగా నమ్మిన. జగన్ అధికారంలోకి రావడానికి పడిన కష్టం, తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాలు విన్న నేను జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తో పాటు నేను ఉద్యోగ రిత్యా కొన్ని రోజులు పాదయాత్రలో పాల్గొ న్నాను. కడపలో పాదయాత్ర ప్రారంభం అయిన అనంతరం జగన్ ప్రసంగిస్తూ. నేను అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండేలా నా పరిపాలన ఉంటుంది. 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అని ప్రకటించారు. ఆ మాటలు విన్న తరువాత జగన్మోహన్ రెడ్డి కి దేనిపై ఆశలు లేవు, అవినీతి ఆరోపణలపై జైల్ కు వెళ్లివచ్చిన జగన్, వాటిని తన చరిత్రనుంచి మరిచిపోయేలా, ప్రజలు మనసులు గెలిచేలా పాలన చేస్తారేమో అనిపించింది. పాదయాత్రలో ప్రజల స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అనుకున్నా. 2019 ఎన్నికల ఫలితాలు చూశాక జగన్ కష్టానికి ప్రతిఫలం లభించింది, పాదయాత్రలో చెప్పినట్లు పాలన సాగుతుంది అనుకున్న.
అధికారంలోకి వచ్చిన అతి తొందరలోనే జగన్ నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించాయి. ముఖ్యంగా రాజధాని తరలింపు పై జగన్ నిర్ణయం పిచ్చోడి చేతిలో రాయిలా అనిపించింది. 33 వేల ఎకరాలతో రాష్ట్రం నడిబొడ్డున ఒక నగర నిర్మాణాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తే, రాష్ట్ర ప్రజల మనుసుల్లో తమ రాజధాని అమరావతి అని బలపడిన నగరాన్ని నామ రూపాలు లేకుండా చేయాలి అనే జగన్ నిర్ణయం పిచ్చోడి చేతిలో రాయి కాకపోతే మరేంటి. జగన్ కు ఇబ్బంది లేకుండా భూమిని గత ముఖ్యమంత్రి సేకరించారు, కొన్ని భవనాల పనులు ప్రారంభం అయ్యాయి, అన్నింటికీ మించి అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఆమోదం వచ్చింది. అలాంటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయిన ఏం చేస్తారు? ఆ పనులను అలాగే కొనసాగిస్తే జగన్ పాలన ముగిసే సరికి అమరావతికి కొంత రూపం వచ్చేది. దాని వల్ల రాష్ట్రానికి, భూములు ఇచ్చిన రైతులకు ఎంతో లాభం జరిగేది. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఏమి చేయలేదు, జగన్ రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు అని రాజకీయంగా వైసీపీ కి లాభం జరిగేది.
ప్రచారం లో జగన్ మాటలకు ప్రస్తుత పాలన పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక దిక్కుమాలిన సౌతాఫ్రికా మాడల్ ను చూపిస్తూ రాజధానిని వైజాగ్ తరలించడం చూస్తుంటే, వైజాగ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఉన్న జగనే ఇప్పుడు ఉన్నట్లు అనిపిస్తుంది, ఎలాంటి మార్పు లేదు. పాదయాత్రలో జగన్ చెప్పిన సుద్దులు అధికారం కోసం చెప్పిన అబద్దాలుగా అనిపిస్తున్నాయి. రాజధాని రైతుల త్యాగాలను గుర్తించని జగన్ తన మంత్రులతో వాళ్ళను చాలా అవమాన పరిచారు. రాజధాని మార్పుకు ఒక కులం కారణం అని కుల చిచ్చు పెట్టె ప్రయత్నం చేశారు. రాజధాని ఒక్క ప్రాంతం లోనే ఉండాలా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం అని ప్రాంతీయ విభేదాలు సృష్టించారు. టీడీపీ వాళ్ళు కొన్న నాలుగు వేల ఎకరాల కోసం రాజధాని మారుస్తున్నాం అని చెప్పి మరింత పలుచన అయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత అవమానించినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతుల పట్టుదల చూస్తుంటే జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుందేమో.
ఆంధ్రులు చాలా తెలివి గలా వాళ్ళు అని అంటుంటారు. అవును వాళ్లకు తెలివి ఎక్కువే కులాల పై ప్రేమ ఎక్కువే. కులాల పంచాయితిలో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అమరావతి నిర్మాణం అనేది రాష్ట్రం మొత్తానికి సంబందించిన అంశం. అక్కడ అద్భుతమైన నగరం నిర్మాణం జరిగితే అటు శ్రీకాకులం, ఇటు అనంతపురం వరకు ప్రజలకు అందరికి లాభం జరుగుతుంది. ఒక నగరం ఏర్పాటు జరిగితే యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్టికంగా రాష్ట్రం బలపడుతుంది. అమరావతిపై అందరికి హక్కు ఉంటది.కానీ అమరావతి తరలింపుపై మాత్రం కేవలం భూములు ఇచ్చిన రైతులు మాత్రమే ఉద్యమం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. రాయలసీమ ప్రజలు, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు , కృష్ణ,.గుంటూరు ప్రజలు కూడా తమ కు సంబంధం లేనట్లు సినిమా చూస్తూ ఉండిపోయారు. జరుగుతున్న నష్టాన్ని, రాబోవు ప్రమాదాన్ని గ్రహించలేక పోతున్నారు. అమరావతి ఒక కులానికి సంబంధించింది అని జగన్ ఒక వర్గం ప్రజల్లోకి బాగా ఎక్కించారు. ఇప్పుడు మేల్కొనక పోతే జరిగే నష్టాన్ని ప్రజలు గ్రహించాలి. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కొలుకోదు. ఆంధ్రుల రాజధాని త్రిశంకు స్వర్గంలో ఉంది, అది ఎప్పుడు బయట పడుతుందో తెలియదు. ఆలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. జగన్ నిర్ణయాలు, ప్రజల అలసత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాస్త అంధ ప్రదేశ్ గా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.