ఏపీ రాజధానిని విశాఖకు మార్చాలనే జీఎన్ రావు కమిటీ నివేదికపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శనివారం అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళనలను తీవ్రం చేశారు. రోడ్లపై టైర్లను కాల్చారు. రైతులు, మహిళలు విద్యార్ధులు వెలగపూడి వెళ్లే రహదారిపై బైఠాయించారు. జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విలువైన భూములను రాజధానికి ఇచ్చామని…ఇప్పుడు రాజధాని మారిస్తే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని మార్చకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఆదివారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు.
తుళ్లూరులోని గ్రామ సచివాలయానికి ఉన్న వైసీపీ పార్టీ రంగును గ్రామస్థులే మార్చారు.తాము వైసీపీ అభిమానులమేనని..రాజధాని మార్చుతు తమకు అన్యాయం చేస్తోన్న ఆ పార్టీ రంగులను కడుపు మంటతో తామే మార్చామన్నారు.
మందడలో మహిళలు వినూత్న నిరసన తెలిపారు. వర్షాలొస్తే రాజధాని మునిగిపోతుందంటూ మంత్రులు ప్రకటించడంతో…మహిళలు పడవ ఎక్కి నిరసన తెలిపారు. మునిగిపోయే రాజధాని అంటూ మమ్మల్ని ముంచేశారని నినదించారు.
మరో వైపు రాజధానిని మార్చాలన్న జీఎన్ రావు కమిటీ నివేదికను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.
విష్ణువర్ధన్ రెడ్డి (బీజేపీ) :
ఏపీ రాష్ట్ర రాజధానిని విశాఖకు మార్చాలనే జీఎన్ రావు కమిటీ నివేదికపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కమిటీ నివేదిక ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. జీఎన్ రావు కమిటీ ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తీసుకోలేదని…ఆ కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికిరాదన్నారు.
కర్నూల్ కు హైకోర్ట్ బెంచ్ రావడం వల్ల ఏం ఉపయోగం లేదని…నాలుగు జీరాక్ష్ మిషన్లు, నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప అని ఎద్దేవా చేశారు. అమరావతిలో నాలుగు వేల ఎకరాల కుంభకోణం జరిగిందని చెబుతున్న వైసీపీ ఎందుకు నిరూపించలేకపోతుందని ప్రశ్నించారు. రైతులు కష్టమో..నష్టమో తమ పొలాలు త్యాగం చేసి రాజధానికి ఇచ్చారని చెప్పారు. రాయలసీమలో పంటలు పండక ఏడుస్తుంటే అమరావతిలో రైతులను ఏడిపిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులు రాష్ట్రాన్ని తమ జాగీరునుకుంటూ పుట్ బాల్ లా ఆడుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలని..అదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
దూళిపాల నరేంద్ర చౌదరి :
టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా అందరూ ఒక్కటై పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతా కలిసి జేఏసీగా ఏర్పడాలని, ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున జేఏసీలో భాగస్వామ్యం కావాలని కోరారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రవణ్ మద్దతు తెలిపారు.
భూమా అఖిలప్రియ :
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. జగన్ తనకు అనుకూలంగా రాజధానిపై జీఎన్.రావు కమిటీతో రిపోర్ట్ ఇప్పించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల మద్య చిచ్చు పెడుతోందని ఆమె ఆరోపించారు. రాయలసీమ నుంచి విశాఖకు రోడ్ కనెక్టివిటీ ఉందా? అని అఖిలప్రియ ప్రశ్నించారు. అసలు సామాన్యులు విశాఖకు వెళ్లే పరిస్థితి ఉందా అంటూ మండిపడ్డారు. విశాఖలో హుద్ హుద్ తుఫాన్ రాలేదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్నారు. ప్రభుత్వ తీరును యువత ప్రశ్నించాలని అఖిలప్రియ కోరారు.
సుజనా చౌదరి (బీజేపీ) :
మూడు రాజధానుల ప్రతిపాదన సరైందని కాదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తప్పుబట్టారు. రాజధానిని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదని..రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సరైన సమయంలో కేంద్రం సరైన చర్యలు తీసుకుంటుందని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజు గారు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదన్నారు. అసలు కమిటీ ఎక్కడ పర్యటించింది…ఏం నివేదిక ఇచ్చిందని సుజనా చౌదరి ప్రశ్నించారు. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే సమస్యే ఉండదన్నారు. రాజధాని మార్పు విషయంపై త్వరలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించనున్నట్టు సుజనా చౌదరి తెలిపారు.