గుంటూరు: అమరావతి విషయంలో రచ్చ మొదలయ్యింది. రాజధాని రైతులు రోడ్డెక్కారు. రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంపై మండిపడుతున్న రైతులు.. ఉద్యమబాట పడుతున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించబోమని అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ముఖ్యులు ఇస్తున్న లీకులతో రాజధాని ప్రాంతవాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిని వేరేప్రాంతానికి తరలిస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. రాజధాని అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో సచివాలయానికి వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి బొత్స చెప్పినట్లు ఈ ప్రాంతం ముంపులో లేదని, ఎప్పుడైనా వరదలు వచ్చి అమరావతిలో ఏ గ్రామమైనా మునిగిందా? అని రైతులు ప్రశ్నించారు. రాజధాని రైతులు ఒక బృందంగా హైదరాబాద్ వెళ్లి పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి అమరావతి అంశంపై వారికి మొరపెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, జనసేనాని పవన్‌కల్యాణ్ అమరావతిపై జరిపే పోరాటానికి మద్దతు ఇస్తామని వీరికి హామీఇచ్చారు.