ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్నవరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
కిషన్ రెడ్డి ఏలూరు, గుంటూరు జిల్లాల్లో కేంద్రమంత్రి పర్యటించనున్నారు. ఏపీకి మూడు రాజధానులు కాదని, కేవలం ఒక్క రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీకి రాజధాని అమరావతే అనే విషయానికి కట్టుబడి ఉన్నామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని మార్చే ప్రసక్తే లేదన్నారు కిషన్ రెడ్డి.
ఏపీలో రాజధానుల వివాదం, జనసేన అధినేతను విశాఖలో హోటల్ కు పరిమితం చేయడం, జనసేన నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై కిషన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో ఎక్కడైనా కక్ష సాధింపు చర్యలు అనేది కరెక్ట్ కాదని సూచించారు. మొదట్నుంచీ తమ పార్టీ అదే చెబుతోందన్నారు. ధర్నా చేసిన రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వారికి న్యాయం చేసిందని గుర్తుచేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకం 12వ విడత నిధులను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా రూ.16 వేల కోట్లను ప్రధాని మోదీ నేడు విడుదల చేయనున్న సందర్భంగా ఏలూరులో రైతులతో బీజేపీ సమావేశం ఏర్పాటు చేసింది. గన్నవరం చేరుకున్న కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో కలిసి ఏలూరుకు బయలుదేరనున్నారు.