ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు రాజధాని అమరాతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి రోడ్, రైల్వే కనెక్టివిటీ పెంచుతోందన్నారు.
ఫ్లై ఓవర్ ల నిర్మాణం పూర్తి చేశామని.. మోడీ ఆంధ్రప్రదేశ్ ని అంతలా అభివృద్ధి చేస్తుంటే ఎవరు దాని పై ఎందుకు చర్చించడం లేదని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కడా రాజధాని నిర్మాణం సమస్యలు రాలేదు..మరి ఏపీ విషయంలోనే ఎందుకు వస్తుందో ఆలోచించాల్సిన అవసరం చాలా ఉందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ రాజధాని నిర్మాణం చేసినా కేంద్రం ఆర్థిక సహకారం అందించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం వేలకోట్లు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే ఎవరూ కేంద్రం చేస్తున్న అభివృద్ధిని ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన మండిపడ్డారు. అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేస్తే రాజధానులు ఒక్కటా లేక మూడా అని ప్రశ్నలు వేస్తారు. ఒక్క రాజధాని కట్టలేని వారిని.. మూడు రాజధానులు ఎందుకు అని మాత్రం ప్రశ్నలు వేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
భీమవరం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానం చేస్తామని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజకీయాలకు చరమాంకం పాడాలన్నారు. పౌర సరఫరా శాఖ లో ప్రతి ఏడాది అయిదువేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. మరి ఈ అవినీతిని ఎందుకు ఎవరు ప్రశ్నించడం లేదన్నారు.కుటుంబ రాజకీయాల కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే సోషల్ మీడియాలో చంపేస్తామంటూ మెసేజ్ లు పెడతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం సాగిస్తామని సోమువీర్రాజు అన్నారు.