టెన్త్ పరీక్షల లీకేజీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుని టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతుంటే.. అరెస్టయిన వాళ్లు తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అక్రమాలు జరగకుంటే ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఈ డైలాగ్ వార్ కొనసాగుతుండగానే నారాయణపై మరో కేసు తెరపైకి వచ్చింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి భూములకు సంబంధించి ఫిర్యాదు చేయగా.. సీఐడీ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎఫ్‌ఐఆర్ లో ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా నారాయణ, ఏ3 గా లింగమనేని రమేష్, ఏ4 గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6 గా హెరిటేజ్ ఫుడ్స్ ను చేర్చారు.
వీరందరిపై 120 బీ, 420 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్నది రామకృష్ణారెడ్డి ఆరోపణ. ఈ ల్యాండ్ పూలింగ్ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు.
పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ లో నారాయణను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. అయితే.. ఆ సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకుని కారులో వెళ్లారు. అయితే.. ఆయన్ను కిడ్నాప్ చేశారంటూ కుటుంబసభ్యులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి నెంబర్ ఆధారంగా బెంగళూరు జాతీయ రహదారి వైపు వెళ్తున్న వాహనాన్ని కొత్తూరు కూడలి దగ్గర ఆపారు. వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. అందులో నారాయణతో పాటు చిత్తూరు పోలీసులు ఉన్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఓ కేసులో భాగంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లు కొత్తూరు పోలీసులకు వారు చెప్పారు. దీంతో ఆ వాహనాన్ని అక్కడి నుంచి పంపేశారు.