విశాఖపట్నం : ‘అమరావతి’పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కీలక ప్రకటన చేయనున్నదా? రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తాజా ప్రకటన బట్టి చూస్తుంటే కొద్ది రోజుల్లో రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో వెల్లడయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రాజధానిపై జగన్ ప్రభుత్వానికి ఆరంభంలోనే ఒక క్లారిటీ ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా యథాతధ స్థితిని కొనసాగించాలని నిర్ణయించినట్టు చెబుతారు. ముఖ్యంగా రాజధాని పరిధిలో ఉన్న రెండు జిల్లాల్లోని ప్రజానీకం ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్ణయాన్ని ప్రకటించకుండా ఎప్పటికప్పుడు దాటవేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఐతే, అమరావతి అసలు వుంటుందా..? ఉండదా..? అనే క్లారిటీ ఇచ్చేందుకు ఇక సమయం ఆసన్నమైనట్టుగా మంత్రి మాటలను బట్టి అనిపిస్తోంది.
అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి స్పష్టంచేశారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోందని బొత్స అన్నారు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోందని చెప్పారు. ఇటీవలి కృష్ణా వరదలతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నట్టుగా తెలిసిందని, దీని నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడనుందని, ఎంతో ప్రజాధనం వృథా అవుతుందని బొత్స వివరించారు. వరద నీటిని ప్రత్యేకంగా తోడి బయటకు పంపించాల్సి ఉంటుందని చెప్పారు. మొత్తానికి అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం అంత సుముఖంగా లేదన్నది మంత్రి మాటల్లో స్పష్టమైంది.