మాజీ ముఖ్యమంత్రి, లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ త్వరలో ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో భేటీ అవుతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రిత్పాల్ సింగ్ వెల్లడించారు.
రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు, ఇతర అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రులు, శాసన సభ్యుల వివరాలను ముఖ్యమంత్రికి ఆయన అందజేస్తారని ప్రిత్పాల్ సింగ్ తెలిపారు.
అమరీందర్ సింగ్ హయాంలో అవినీతికి పాల్పడిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వివరాలను రాబట్టేందుకు గాను పంజాబ్ పోలీసులు విచారణ చేపట్టేలా వారికి ఆదేశాలు జారీ చేయాలని మాజీ మంత్రి సుఖ్ జిత్ సింగ్ రంధావా ఇటీవల డిమాండ్ చేశారు.
దీనిపై అమరీందర్ స్పందిస్తూ… తన హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలతో సహా అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించడానికి, ఇతర వివరాలను అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఇటీవల అవినీతి ఆరోపణలపై తన కేబినెట్ మంత్రి విజయ్ షింగ్లాకు మాన్ ఉద్వాసన పలికారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రుల, ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను బయట పెట్టేందుకు తాను సిద్దమని అమరీందర్ ప్రకటించడంతో మాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.