అమర్ నాథ్ క్షేత్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఆర్మీ హెలికాప్టర్లలో యాత్రికులను తరలిస్తున్నారు. నీలగ్రార్ హెలిప్యాడ్ కు వద్దకు తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అకస్మాత్తుగా వచ్చిన వరదలతో అమర్ నాథ్ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఇంకా 40 మందికి పైగా యాత్రికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం మౌంటెన్ రెస్క్యూ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమర్ నాథ్ గుహ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు రెస్క్యూ శునకాలను హెలికాప్టర్ లో తరలించారు.
వరద బీభత్సంతో గుహ ప్రాంతానికి సమీపంలో చాలామంది యాత్రికులు చిక్కుకుపోయారని ఐటీబీపీ జవాన్లు వివరించారు. వరద బీభత్సం నుంచి దాదాపు 15 వేల మంది యాత్రికులను సురక్షితంగా కాపాడామని తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఆర్మీ హెలికాప్టర్లలో అమర్ నాథ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.