అమర్ నాథ్ సమీపంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. అమర్ నాథ్ ఆలయ సమీపంలో వరదలు వచ్చాయి. దీంతో 16 మంది మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
గతేడాది ఇదే సమయంలో సరిగ్గా ఇదే ప్రాంతంలో వరదలు వచ్చాయి. దీంతో పలు చొట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రక్షణ సిబ్బంది ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలు కూలిపోయాయి. వరదలకు టెంట్లు కొట్టుకుపోయాయి. కరోనా వల్ల గతేడాది అమర్ నాథ్ యాత్ర లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు.
ఈ ఏడాది యాత్రికులు ఎక్కువ సంఖ్యలో రావడంతో వారికి వసతి కల్పించేందుకు వరద కాలువ దగ్గర తాత్కాలికంగా టెంట్లు వేశారు. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ…. ‘అక్కడ నీటి కాలువ వరదకు గురయ్యే అవకాశం ఉందని అందరికి తెలుసు. కానీ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది’అని అన్నారు.
మరో వైపు వరద నీరు డ్రై బెడ్ లోకి రాకుండా వరద కాల్వకు దగ్గర రెండు ఫీట్ల ఎత్తైన గోడను నిర్మించారు. కానీ భారీ వర్షం కురవడంతో ఆ గోడకన్నా ఎత్తులో వరద నీరు ప్రవహించింది. దీంతో క్షణాల్లోనే అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
గతంలో సంభవించిన వరదలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. అనుకున్నట్టుగానే వరద కాలువకు నీరు రాకుండా అడ్డంగా పెద్ద కట్ట కట్టినట్టు చెప్పారు. వరద నీరు భారీగా రావడంతో నీరు కాలువలోకి చేరిందని ఆయన చెప్పారు.