కరోనా కారణంగా రెండేళ్లు బ్రేక్ పడిన అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గిపోవడంతో.. అమర్‌నాథ్ యాత్ర 2022 కోసం సన్నాహాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన పలు అంశాలపై వారు కూలంకషంగా చర్చించారు.
ఈ సారి అమర్‌నాథ్ యాత్రను జూన్ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజుతో యాత్రను ముగించనున్నట్లు వారు తెలిపారు. అయితే, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అమర్‌నాథ్ యాత్రికులకు అవకాశం ఇవ్వనున్నారు. గత రెండు సంవత్సరాల యాత్రకు బ్రేక్ పడటంతో ఈ సారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం బోర్డు అంచనా వేస్తుంది.
ఇక, అమర్‌నాథ్ క్షేత్రంలో ఈసారి వాహనాలు, ప్రయాణికుల కదలికలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్‌డీ)ని ఉపయోగించనున్నారు. ఒకేసారి 20 వేల మంది బస చేసేందుకు వీలుగా భవనాన్ని నిర్మించాలని పాలనా యంత్రాంగం నిర్ణయించింది. రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్‌లో అమర్‌నాథ్ క్షేత్రం బోర్డు ద్వారా మూడు వేల పడకల యాత్రి నివాస్‌ను నిర్మించామని తెలిపారు అధికారులు. అలాగే, యాత్రికుల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకుంటున్నామన్నారు.