ఇండియాలో చిన్న, మధ్య తరహా వ్యాపారాల డిజిటలైజేషన్ కొరకు బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ చెప్పారు. ఓ సమ్మిట్ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన ఆయన 2025 సంవత్సరం వరకు 10 బిలియన్ల విలువ చేసే మేకిన్ ఇండియా వస్తువుల ఎగుమతి కోసం అమెజాన్ గ్లోబల్ పద్ధతిని అనుసరిస్తామని తెలిపారు. దేశ రిటైల్ మార్కెట్ రంగంలో విపరీతమైన పోటీ ఏర్పడి స్థానిక వ్యాపారులను కాపాడేందుకు విదేశీ వ్యాపారులకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో జెఫ్ బెజోస్ భారత పర్యటనకు వచ్చారు.
భారత్- అమెరికా మైత్రీ 21 వ శతాబ్ధంలో ఎంతో కీలకమైనదని…ఇది ఇండియన్ సెంచరీగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ దేశం ప్రత్యేకమైనదని..ప్రజాస్వామికమైనదని జెఫ్ బెజోస్ అన్నారు. ఆన్ లైన్ మార్కెట్ వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తున్న వేలాది చిన్న వ్యాపారులు బెజోస్ పర్యటనకు ముందు ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమెజాన్, ప్లిప్ కార్ట్ లాంటి ఆన్ లైన్ ట్రేడర్స్ ఇచ్చే భారీ డిస్కౌంట్లు పై దర్యాప్తు నిర్వహిస్తామని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్…ఇండియా ను కీలకమైన గ్రోత్ మార్కెట్ గా చూస్తున్నందున ఈ దేశంలో 5.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.