అమెజాన్ ఇంక్ షేరు కుప్పకూలింది. శుక్రవారం ఒక్క రోజే 14 శాతానికి పైగా షేరు పతనమైంది. దీంతో అమెజాన్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు 206 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. మార్కెట్ అంచనాల మేరకు ఫలితాలను ప్రకటించకపోవడంతో షేరు కుదేలైందంటున్నారు నిపుణులు. స్టాక్ క్రాష్ అవడంతో అమెజాన్ ఫౌండర్, బిలీనియర్ జెఫ్ బెజోస్ 20.5 బిలియన్ డాలర్లు సంపదను నష్టపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం.. 210 బిలియన్ డాలర్లుగా ఉన్న బెజోస్ సంపద ప్రస్తుతం 148.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
ఎలన్ మస్క్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ధనికవంతుడిగా ఉన్న బెజోస్.. ప్రస్తుతం స్టాక్ క్రాష్ తో మూడో ప్లేస్‌కి దిగజారారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బెజోస్ 44 బిలియన్ డాలర్లను కోల్పోయారు. ఈ ఈకామర్స్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 14.05 శాతం తగ్గడంతో.. షేరు ధర 2,485.63 డాలర్లకు పడిపోయింది. 2001 నుంచి అత్యంత కనిష్ట స్థాయిలో అమ్మకాలను నమోదు చేయడం.. క్వార్టర్లీ నష్టాలు మార్కెట్లో కంపెనీ షేరును దెబ్బ కొట్టాయంటున్నారు నిపుణులు.
మార్కెట్ దెబ్బకు ప్రపంచంలో టాప్ 500 రిచెస్ట్ పర్సన్స్ మొత్తంగా 54 బిలియన్ డాలర్లకు పైన సంపదను కోల్పోయారు. అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. బెంచ్‌మార్క్ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 3.6 శాతం తగ్గింది. అలాగే టెక్ హెవీ నాస్‌డాక్ 100 ఇండెక్స్ 4.5 శాతం పడిపోయినట్టు అమెజాన్ ఇంక్ తన జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాలలో వెల్లడించింది.
ఈ ఫలితాలలో కంపెనీ 3.8 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని పోస్టు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్ లో కంపెనీకి 8.1 బిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయి. కరోనా తర్వాత అమ్మకాలు తగ్గడం, ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్‌లోని తన పెట్టుబడుల్లో భారీ రైట్-డౌన్ కారణంతో తొలిసారి త్రైమాసికపు నష్టాలను అమెజాన్ పోస్టు చేసింది.