కరోనా మహమ్మారి కారణంగా ఆన్ లైన్ ఆర్డర్లు బాగా పెరిగాయి. నచ్చిన భోజనం దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, నిత్యావసర సరుకులు ఇలా ఏది కావాలంటే అది ఇంటి నుంచే తెప్పించుకుంటున్నారు. అయితే, అప్పుడప్పుడు ఒకటి ఆర్డర్ చేస్తే దాని బదులు మరొటి రావటం చాలానే చూస్తుంటాం. ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు రావడం.. షూస్ కొనుగోలు చేస్తే సబ్బు పెట్టెలు.. ఆట వస్తువులకు బదులు ఇటుకలు రావటం ఇలా ఎన్నో ఘటనలు గతంలో జరిగాయి. తాజాగా ఓ కస్టమర్‌కు అమెజాన్ ఇలాంటి ఝలకే ఇచ్చింది. ఎంతో డబ్బు పెట్టి కొన్నా వస్తువుకి బదులు చిత్తు కాగితాలను డెలివరీ చేసింది.
హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన యశ్వంత్ అనే యువకుడు ఎన్నో రోజులుగా మ్యాక్ బుక్ కొనాలని అనుకున్నాడు. అందుకోసం డబ్బులు దాచుకున్నాడు. ఆఫర్లు ఏం లేకపోయినా అమెజాన్ వెబ్ సైట్‌లో రూ.1,05000 పెట్టి ఆర్డర్ చేశారు. అతడికి అమెజాన్ పార్శిల్ కూడా డెలివరీ అయింది. ఎంతో ఆశగా దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యాడు.
తాను మ్యాక్ బుక్ ఆర్డర్ చేస్తే అందులో కాగితాల కట్ట వచ్చింది. అయితే, యశ్వంత్ ఈ-కామర్స్ సైట్లలో ఒకటి బుక్ చేస్తే ఇంకోటి రావడం గురించి చాలా సార్లు వినటంతో.. పార్శిల్ ఓపెన్ చేసేప్పుడు వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో రికార్డును జత చేసి ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని అమెజాన్ సీఈఓ, సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాడు.
అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే.. పార్శిల్ వచ్చిన తర్వాత దాన్ని తెరిచేటప్పుడు ముందు జాగ్రత్తగా వీడియో రికార్డ్ చేయటం మంచిది. అందులో ఉంది తాము ఆర్డర్ చేసింది కాకపోతే ఆ వీడియో ప్రూఫ్ చూపించి ఫిర్యాదు చేయొచ్చు.