చిన్న నిర్మాతలకు కొండంత అండ అమెజాన్ ప్రైమ్. తమ సినిమాకు ఎక్కడ బిజినెస్ జరక్కపోయినా, అమెజాన్ నుంచి కనీస రాబడి వస్తుందనే ధైర్యం వాళ్లలో ఉంది. కొంతమంది నిర్మాతలైతే కేవలం అమెజాన్ నుంచే లాభాలు అందుకున్న సందర్భాలున్నాయి. పెట్టిన పెట్టుబడితో పాటు లాభాల్ని కూడా అమెజాన్ నుంచి పొందిన నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడిలాంటి నిర్మాతలందరికీ పెద్ద షాక్.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ తన రూల్స్ మార్చినట్టు తెలుస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా చిన్న సినిమాల్ని పక్కనపెడుతోంది ఈ సంస్థ. మరీ ముఖ్యంగా డైరక్ట్ స్ట్రీమింగ్ కింద చిన్న సినిమాల్ని తీసుకోవడం పూర్తిగా ఆపేసింది. పెద్ద హీరోలు లేదా ఓ మోస్తరు హీరోల సినిమాల్ని మాత్రమే డైరక్ట్ స్ట్రీమింగ్ కింద లెక్కలోకి తీసుకుంటోంది.
ఇక ఆల్రెడీ థియేటర్లలో రిలీజై అమెజాన్ గుమ్మం తొక్కుతున్న చిన్న సినిమాలకు ఇప్పుడు చుక్కెదురవుతోంది. చాలా సినిమాల్ని ఈ సంస్థ రిజెక్ట్ చేస్తోంది. ఒక్కో సినిమాకు ఒక్కో కారణం చెబుతున్నప్పటికీ.. ఓవరాల్ గా చిన్న సినిమాలకు ఎసరు పెట్టినట్టు కనిపిస్తోంది.
Advertisements
అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా కీలక మార్పులు జరిగాయి. సౌత్ కు సంబంధించి కీలక వ్యక్తులు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరికొంతమంది వచ్చి చేరారు. వీళ్ల రాకతో చిన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా లేక కంపెనీనే వ్యవస్థాగంగా ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుందా అనేది ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.