తమ సిబ్బంది సంఖ్యను కుదించడంలో భాగంగా 18 వేలమందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు వచ్చిన వార్తలు నిజమేనని అమెజాన్ ధృవీకరించింది. ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాండీ జెస్సీ బుధవారం ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ నెల 18 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇది తమ కంపెనీ మీదే కాక.. మానవ వనరుల విభాగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న అనిశ్చిత ఎకానమీ కారణంగా ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు.
తమ టీమ్ మేట్స్ లో ఒకరు ఈ సమాచారాన్ని లీక్ చేశారని ఆయన పేర్కొన్నారు. వేర్ హౌస్ స్టాఫ్ తో సహా అమెజాన్ లో 1.5 మిలియన్ సిబ్బంది ఉన్నారు. వాల్ మార్ట్ తరువాత అమెరికాలో ఇది రెండో అతి పెద్ద కంపెనీ. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, బిజినెస్ డల్ కావడం, ఖర్చులను తగ్గించుకోవాలని కన్స్యూమర్లు నిర్ణయించుకోవడం, ఏడాది కాలంగా దీని షేర్ల విలువ తగ్గడం వంటివి అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి.
గత నవంబరు నుంచే ఈ సంస్థ తమ ఉద్యోగులకు ‘ప్రమాద ఘంటికలు’ మోగిస్తూ వస్తోంది. 10 వేలమంది సిబ్బందిని తొలగిస్తామని చెబుతూ వచ్చింది. ఇక తమ వేతనాలను, ఇతర ప్రయోజనాలను తగ్గించుకుంటామని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ లు స్వచ్చందంగా ప్రకటించారు కూడా.
ట్విట్టర్ తో మొదలైన ఈ ట్రెండ్ అన్ని సంస్థలోనూ కొనసాగడం విశేషం. అమెజాన్ లో కార్పొరేట్ స్థాయిలో 6 శాతం మందిని తొలగించవచ్చునని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 లక్షలమంది వర్క్ ఫోర్స్ గల ఈ సంస్థ ఇప్పుడు ‘డీలా’ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.