ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఎంగేజ్ మెంట్ గురువారం సాయంత్రం ముంబైలో ఘనంగా జరిగింది. అంబానీ నివాసమైన అంటీలియాలో వీరి ఎంగేజ్ మెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యులు పాల్గొని, సందడి చేశారు. మరికొద్ది రోజుల్లోనే వీరి వివాహం జరగనుంది.
రాధికకు అనంత్ కు కొద్ది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అనంత్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందాడు. ఆ తర్వాత నుంచి రిలయన్స్ లోని జియో, రిటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా ఉంటూ వివిధ హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సంస్థలోని ఎనర్జీ బిజినెస్ కు నేతృత్వం వహిస్తున్నారు.
ఇక ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ కుమార్తె రాధికా మర్చంట్. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్ లో రాధికా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత చదవుల కోసం న్యూయార్క్ వెళ్లారు. ప్రస్తుతం ఎన్ కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కాగా మంగళవారం ఘనంగా మోహందీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో పెళ్లి కూతురు రాధికా మర్చంట్ అలియా భట్ పాటకు డ్యాన్స్ చేసి ఇరగదీశారు. మెహందీ వేడుకలో రాధికా మర్చంట్ హెవీ ఎంబ్రాయిడరీ పింక్ కలర్ రేషమ్ లెహెంగా ధరించారు. ఈ లెహెంగాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జాని, సందీప్ కోస్లా ప్రత్యేకంగా రూపొందించారు.