బాలకృష్ణ టాక్ షోలో చంద్రబాబు నాయుడు చెప్పిన అనేక విషయాలను ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. చంద్రబాబు వైఖరిపై పలు విమర్శలు గుప్పించారు. పలు సందేహాలు వ్యక్తం చేశారు. టాక్ షోలో చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చి చెప్పారు.
27 ఏళ్ళ కిందట చేసిన వెన్నుపోటు రక్తపు మరకలను బావ, బావమరుదులు కలిసి తుడిచే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఇంత వరకు ఒక్క రాజకీయ నాయకుడు హాజరుకాని టాక్ షోకు చంద్రబాబు తన రాజకీయంగా పనికి వస్తుందేమో అని హాజరయ్యారని అంబటి అన్నారు.
మూడు గంటలు కాళ్ళు పట్టుకుని బతిమాలినా ఒప్పుకోలేదు అందుకే జుట్టు పట్టుకుని లాగేశాను అనే విధంగా చంద్రబాబు మాట్లాడటం ఎంత ఘోరం అని అంబటి అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరుకాడు…కానీ బాలకృష్ణ టాక్ షోకి హాజరవుతాడని ఎద్దేవా చేశారు.
బాలకృష్ణ చంద్రబాబుల అన్‌స్టాపబుల్ చర్చ ద్వారా వెన్నుపోటు ఎలా జరిగిందో ఈ తరం వాళ్ళకు తెలిసేటట్లు చేశారని, దీనికి కారణమైన ఆహా సంస్థను అంబటి రాంబాబు అభినందించారు.
వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ పై చెప్పులు వేయటం కరెక్ట్ అని బాలకృష్ణ చెప్పటం ఎంత దౌర్భాగ్యం అని అంబటి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బాలకృష్ణ తానా అంటే తందానా అంటున్నాడని, ఎన్టీఆర్ మరణించి ఉండకపోతే మీ బతుకు ఏమయ్యి ఉండేదని ప్రశ్నించారు.
మీ స్నేహితుడు ఎవరని అడిగితే రాజశేఖరరెడ్డి, నేను కలిసి తిరిగే వాళ్ళం అని చంద్రబాబు చెప్పిన విషయంపై కూడా అంబటి రాంబాబు స్పందించారు. రాజశేఖరరెడ్డి వెంట తిరుగుతూ ఖర్చుల కోసం చంద్రబాబు డబ్బులు తీసుకునే వాడు. ఆ విషయాన్ని చంద్రబాబు ఎందుకు చెప్పడు? అంటూ అంబటి నిలదీశారు.
అన్‌స్టాపబుల్ షోకు లక్ష్మీ పార్వతిని, నాదెండ్ల భాస్కర్‌ను కూడా పిలిచి ఉండే బాగుండేదని అంబటి అభిప్రాయపడ్డారు.చంద్రబాబు పతనం అన్‌స్టాపబుల్, లోకేష్ పతనం అన్‌స్టాపబుల్, టీడీపీ పతనం అన్‌స్టాపబుల్, వైసీపీ 175 సీట్లు సాధించటం అన్‌స్టాపబుల్ అని అంబటి జోస్యం చెప్పారు.
ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకోవడంలో లాజిక్ ఉంది, అర్ధం ఉందని అంబటి అన్నారు. ఎన్టీఆర్ ఒంటరి అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా పట్టించుకోలేదని అంబటి గుర్తుచేశారు. ఇంత మంది పిల్లలు ఉన్నా ఒక్కరైనా కనీసం మంచి నీళ్ళు అయినా ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.