తెలుగు తేజం అంబటి రాయుడు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. అయితే.. ఆ వెంటనే ట్వీట్ ను డిలీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో రిటైర్మెంట్ విషయంలో వెనక్కి తగ్గి ఉంటాడనే చర్చ క్రికెట్ ఫ్యాన్స్ లో జరుగుతోంది.
“ఇది నా చివరి ఐపీఎల్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. నేను 13 సంవత్సరాలుగా 2 గొప్ప జట్లలో భాగమయ్యాను. అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాను. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు రాయుడు.
ఐపీఎల్ లో ఇప్పటివరుకు 187 మ్యాచులు ఆడాడు రాయుడు. 4,187 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీతో పాటు 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2010లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగి ఎంట్రీ ఇచ్చాడు. 2017 వరకు ముంబై టీమ్ తోనే కొనసాగాడు. కానీ.. 2018లో చెన్నై అతడ్ని దక్కించుకుంది. ఆ సీజన్ లో చెలరేగి ఆడాడు.
2018 ఐపీఎల్ లో ధాటిగా ఆడడంతో.. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటుని ఆశించాడు రాయుడు. కానీ.. అప్పటి సెలెక్టర్లు అతడి స్థానంలో విజయ్ శంకర్ ని తీసుకున్నారు. ఆ సమయంలో క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఐపీఎల్ లో ఇదే తనకు లాస్ట్ సీజన్ అని ట్వీట్ చేసి.. కొన్ని నిమిషాల్లోనే డిలీట్ చేశాడు. దీంతో మళ్లీ వెనక్కి తగ్గాడా అని మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.