తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ముఖ్యంగా ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కేబినెట్. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్ కు పిలిపించి.. లక్షలాది మంది మధ్య అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు హరీష్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను హరీష్ రావు మీడియాకు వివరించారు. ఇప్పటికే తొలి విడతలో పలు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు యూనిట్లు అందజేయగా.. త్వరలో రెండో విడత ప్రక్రియను చేపట్టనున్నట్లు హరీష్ ప్రకటించారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో 58, 59, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, కాశీ, శబరిమలలో రూ.25 కోట్ల చొప్పున నిధులతో వసతి గృహాల ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్ లోతైన చర్చ జరిపి, నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.
దళితబంధులో 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు హరీష్ చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని హుజూరాబాద్ లో వందశాతం లబ్ధిదారులకు దళితబంధు అందించామన్నారు.
మిగతా 118 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు అందించనుండగా.. మరో 200 మందికి చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేయనున్నామన్నారు. మొత్తం 1.30లక్షల మందికి దళిత బంధు అందిస్తామని చెప్పారు. గతంలో దళితబంధు అందించే ప్రక్రియ గతంలో ఎలా అయితే కలెక్టర్ల ద్వారా జరిగిందో.. ఈ సారి కూడా అదేవిధంగాలో ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ శాఖ అధికారులతో పాటు సీఎస్ ను ఆదేశించడం జరిగిందని హరీష్ రావు వివరించారు.
అలాగే సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు మంత్రి. దీనికి గృహలక్ష్మి పథకంగా పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 4 లక్షల మందికి ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని వివరించారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో నిర్మించుకున్న ఇళ్ల అప్పులను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి హరీష్.