మృతి చెందిన తన కొడుకు మృతదేహాన్ని.. వేరే వాహనంలో తీసుకెళ్లకుండా ఆస్పత్రి సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. తమ అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలని పట్టుబట్టారు. దీంతో చేసేదేం లేక ఆ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. ఇంతటి అమానవీయ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు అనారోగ్యం పాలవటంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ బాలుడు సోమవారం రాత్రి మృతిచెందాడు.
ఈ క్రమంలో బాలుడి మృతదేహం తరలించేందుకు బంధువులు ఆస్పత్రికి అంబులెన్స్ పంపించారు. అయితే, తమ వాహనంలోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలని రుయా అంబులెన్స్ డ్రైవర్లు పట్టుబట్టారు.
దీంతో చేసేదేమిలేక ఆ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామం తీసుకెళ్లాడు. బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణమని స్థానికులు వాపోతున్నారు.