ప్రోటో కాల్ పేరుతో పోలీసులు చూపిన అత్యుత్సాహం విమర్శల పాలైంది. హైదరాబాద్ మసబ్ ట్యాంకు దగ్గర హోంమంత్రి మహమూద్ అలీ వస్తున్నాడని.. ట్రాఫిక్ ను ఆపేశారు పోలీసులు. ఆ సమయంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. దారి ఇవ్వాలని సిబ్బంది వచ్చి బతిమలాడారు. అయినా పోలీసుల మనసు కరగలేదు. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమయానికి రోగికి చికిత్స అందించకపొతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని అంబులెన్స్ సిబ్బంది.. పోలీసులను చాలాసేపు బతిమలాడారు. పైగా.. సైరెన్ ఆపమని హుకూం జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. వీరి ఓవర్ యాక్షన్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజల ప్రాణాల కన్నా ప్రోటోకాల్ ముఖ్యమా అని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.