కేంద్రం నిధులు ఇచ్చి టీఆర్ఎస్ తో పోటీ పడాలన్నారు మంత్రి కేటీఆర్. ఎల్బీ నగర్ లో ఆయన పర్యటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో నిర్మించిన అండర్ పాస్ ను.. బైరామల్ గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
అండర్ పాస్ కోసం రూ.9.28 కోట్లు ఖర్చు చేయగా.. ఫ్లైఓవర్ కోసం రూ.29 కోట్లు వెచ్చించారు. హైదరాబాద్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలను తీర్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రూ.10 వేల కోట్లు తీసుకొస్తే సన్మానం చేస్తామంటూ సవాల్ విసిరారు కేటీఆర్.
ఇటు నాగోల్, బండ్లగూడలో నాలా అభివృద్ధి పనులకూ శంకుస్థాపన చేశారు మంత్రి. అయితే.. కేటీఆర్ ఎల్బీ నగర్ పర్యటన సందర్భంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కష్టాలు ఉండవని ఓవైపు కేటీఆర్ చెప్తుంటే.. ఆయన వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపేశారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, కొత్తపేట నుంచి వచ్చే రూట్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలనీల నుంచి వచ్చే వాహనాలను కూడా పోలీసులు ఆపేశారు. రెండు అంబులెన్స్ లు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. మంత్రి పర్యటన కోసం ట్రాఫిక్ ను అడ్డుకోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా అంబులెన్స్ లు ట్రాఫిక్ లో చిక్కుకుపోయినా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు.