బతుకమ్మ పండుగ.. తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే ఈ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. పండుగ చివరి రోజు ఊరూవాడా సద్దుల బతుకమ్మను పేర్చి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసాయి. బతుకమ్మలతో హుస్సేన్ సాగర్ కాంతులీనింది.
వరంగల్, హన్మకొండ వేడుకలు జాతరను తలపించాయి. అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకుని వందలాదిగా తరలివచ్చిన మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. తర్వాత బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు. ఇతర జిల్లాల్లోనూ పూల పండుగను ఘనంగా నిర్వహించారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి.
కూకట్ పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అయితే, ఆమె కోసం చాలాసేపు ట్రాఫిక్ ను నిలిపివేశారని.. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాహనదారులు ఆరోపించారు. ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయిందని… అందులో ఉన్నవారు సతమతం అవుతున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోలేదని తెలిపారు. పోలీసుల తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు కూకట్ పల్లి మెట్రో స్టేషన్ కింద కారులో మంటలు చెలరేగాయి.. దానివల్లే ట్రాఫిక్ జాం అయిందని అంటున్నారు పోలీసులు. కూకట్ పల్లి నుంచి మూసాపేట ఫ్లై ఓవర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.