– ప్రీలాంచ్ ల పేరుతో వేలకోట్ల దోపిడీ
– ఒక్క ప్రాజెక్ట్ లోనే 3వేల మందికి టోపీ
– అడ్డగోలు అనుమతులు.. రోడ్డునపడ్డ కుటుంబాలు
– ప్రభుత్వ భూమి అని తెలిసినా అగ్రిమెంట్స్
– మామూళ్ల మత్తులో నాయకులు, అధికారులు
– రియల్ ఎస్టేట్ దందాలో సాహితీ స్కాములే వేరయా?
– అమీన్ పూర్ ప్రాజెక్ట్ పై తొలివెలుగు స్పెషల్ రిపోర్ట్
– సాహితీ స్కాం-నారాయణ లీలలు పార్ట్-1
క్రైంబ్యూరో,తొలివెలుగు:హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జూదం లాంటిది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కస్టమర్లను బుట్టలో వేసుకునేందుకు రియల్ సంస్థలు చేసే ట్రిక్కులు అలా ఉంటాయి మరి. అమాయకంగా వారి బుట్టలో పడ్డామంటే అంతే. నిలువు దోపీడీనే. అయితే.. అన్నిసార్లు కలిసి రాదు. ఏదో ఒక రోజు అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండవు. ఇప్పుడు సాహితీ సంస్థకు ఎదురైంది ఇదే. వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఎలాంటి అనుమతులైనా పొందవచ్చని అనుకునే వారికి సాహితీ స్కాంల చిట్టా గుణపాఠం లాంటిది. సొంతింటి కల కోసం కష్టపడే సామాన్యులను ప్రీ లాంచ్ పేరుతో సర్వం దోచేస్తున్న ఇలాంటి సంస్థలకు అలుసు ఇచ్చిందెవరు? ముమ్మాటికి రెరా, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే దీనంతటికి కారణంగా చెప్పుకోవచ్చు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో అక్రమాలు చూసుకుని అనుమతులు ఇవ్వాలా వద్దా అనేది వారిదే తుది నిర్ణయం. వాటి ఆధారంగానే ప్రజలు పెట్టుబడులు పెడుతుంటారు. కానీ.. తెలంగాణలో భూతద్దం పెట్టి వెతికినా అలాంటి వ్యవస్థ కనిపించడం లేదు.
అమీన్ పూర్ ప్రాజెక్ట్ కథేంటి?
శర్వాని ఎలైట్ పేరుతో 17 ఎకరాల్లో 38 అంతస్తులతో 8 టవర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో 4,408 డబుల్ బెడ్రూం, ట్రిబుల్ బెడ్రూం నిర్మాణాలు చేపడతామని ప్రచారం చేసుకుని ప్రీ లాంచ్ కి తెరలేపారు. 2018 వరకు భూమి వారిది కాదు, అనుమతులు రాలేదు. కానీ.. అడ్వాన్స్ లు తీసుకున్నారు. 2019లో 5 ఎకరాలకు హక్కులు వచ్చాయని అందరికీ చెప్పేసి ఒకేసారి మొత్తం అమౌంట్ కట్టించుకున్నారు. స్క్వేర్ ఫీట్ రూ.2 వేల చొప్పున ఇస్తామని మాయ మాటలు చెప్పారు. నిజానికి ఇది నిర్మాణానికే సరిపోతుంది. కానీ.. ఫస్ట్ డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా రెచ్చిపోయారు.
టైటిల్ పై తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్
అమీన్ పూర్ సర్వే నెంబర్ 343లో సాహితీ లక్ష్మి నారాయణ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ సర్వే నెంబర్ పై మొత్తం 268 ఎకరాల భూమి ఉంటుంది. ఇది అంతా ప్రభుత్వ భూమి. 2005లో ఏడుగురు స్వాతంత్ర్య సమరయోధులకు 35 ఎకరాలు(ప్రొసీడింగ్ నెంబర్ బీ-96/2005) కేటాయించారు. ఈ భూమిని 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి వీలుంటుంది. కానీ.. వారంతా 2007లోనే అమ్ముకున్నారు. జీవో నెంబర్ 185 ప్రకారం అప్పటి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ 2007 జనవరి 27న వారికి ఇచ్చిన పట్టాలను రద్దు చేశారు. ఇదే తీర్పును హైకోర్టు సమర్ధించింది. కానీ, ఇవేవీ పట్టించుకోని అధికారులు నారాయణ లక్ష్మి కటాక్షాలకు లొంగిపోయి అనుమతులు ఇచ్చేశారు. వాటిని చూసే అమాయకపు ప్రజలు రూ.400 కోట్లు సమర్పించుకున్నారు. ఈ లిటిగేషన్ తెలిసి అధికారులు మరికొన్ని అనుమతులకు ఆలస్యం చేశారు. దీంతో ఇక్కడ వచ్చిన డబ్బులు మరో ప్రాజెక్ట్ కు తరలించారు. అక్కడ కూడా లిటిగేషన్ ఉంది. మరో కథనంలో చూద్దాం.
ఆ భూమి నిర్మాణాలకే పనికిరాదు?
మొత్తం ప్రభుత్వ భూమిలో మరో 40 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ కి, 2.13 గుంటలు స్మశాన వాటికలకి. పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి 70 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 118 ఎకరాలు నివాసయోగ్యానికి పనికి రాదని ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టవద్దని జీహెచ్ఎంసీ ఓ రిపోర్ట్ లో పేర్కొంది. సాల్ట్ ఎఫెక్టడ్, స్ర్కాప్ స్థలంగా తేల్చేసింది. అయితే, హెచ్ఎండీఏ మాత్రం 32 అంతస్తులకు అనుమతి ఇచ్చింది. ఇందుకు పెద్ద మొత్తంలో అందరికీ డబ్బులు ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నారు. ఇలాంటి ప్రాంతంలో నిర్మాణం చేపడితే ఆందోళనకరమైన పరిస్థితే ఉంటుంది. భారీ భవంతులకు ఇరువైపులా చెరువులు ఉంటాయి. అమీన్ పూర్, గంగారం చెరువులతో ప్రమాదం పొంచి ఉంటుంది. అయినా కూడా హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఇచ్చేస్తుందని ప్రీ లాంచ్ పేరుతో సామాన్యుల కొంపలు ముంచారు టీటీడీ బోర్డ్ మెంబర్ లక్ష్మి నారాయణ.
ఇదొక్కటే కాదు.. బాగోతాలెన్నో!
సాహితీ స్కాంలు ఏంటని తొలివెలుగు క్రైంబ్యూరో వేట మొదలు పెడితే.. బాగోతాలన్నీ భారీగా బయటకొస్తున్నాయి. 6 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ లో అన్నింటిలో ఎదో ఒక లిటిగేషన్ ఉంది. 4 కమర్షియల్ కాంప్లెక్స్ లు పర్వాలేదు. విజయవాడ ప్రాజెక్ట్స్ 3 రెసిడెన్షియల్, 3 కమర్షియల్ నిర్మాణాలు చేస్తున్నారు. మొత్తం 8 ప్రాజెక్ట్స్ లో ప్రీ లాంచ్ తో రూ.775 కోట్లు వసూలు చేశారు. శంషీగూడ ప్రాజెక్ట్ లో రూ.50 కోట్లు తీసుకుని క్యాన్సిల్ చేసుకున్నారు. గతంలో శంషీగూడ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది తొలివెలుగు. ఇక జీఎస్టీ వ్యవహారం కూడా ఉంది. కస్టమర్స్ వద్ద నుంచి వసూలు చేసి 6 నెలలుగా రిటర్న్స్ వేయడం లేదు. రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీనే ఎక్కువగా నడుస్తుంది. ఇదే ఆసరాగా.. నగదునే ప్రొత్సహించి సంచులకు సంచులు నింపుకొని దాచి పెట్టుకున్నారని తెలుస్తోంది. అన్ని ఆధారాలతో తొలివెలుగు క్రైంబ్యూరో బట్టబయలు చేయబోతోంది. సాహితీ స్కాం-నారాయణ లీలలు పార్ట్ -2 లో మాదాపూర్ లో రెండు ప్రాజెక్ట్స్ మాయాజాలం ఏంటో చూద్దాం.