దేశానికి హానికరంగా పరిణమించిన మద్యం పాలసీపై బీజేపీ నేత ఉమా భారతి గళమెత్తారు. లిక్కర్ పాలసీకి సవరణలు చేయకపోతే తాము ఉద్యమిస్తామని, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లో ఓ ఆలయాన్ని సందర్శించిన ఆమె.. రాష్ట్రంలో ఈ పాలసీని కఠినతరం చేయాలనీ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించనున్న తరుణంలో ఆమె ఈ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు సాధ్యమైనంతవరకు మద్యానికి దూరంగా ఉండేలా ఈ విధానాన్ని సవరించాలన్నారు. డీఎడిక్షన్ ని ప్రమోట్ చేసేందుకు ఏ రాష్ట్రంలో నైనా లిక్కర్ పాలసీలో కంట్రోళ్లను ప్రవేశపెట్టాలన్నారు.
ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల వాణిని ప్రభుత్వాలు ఆలకించాలని ఆమె సూచించారు. కంట్రోల్డ్ లిక్కర్ పాలసీని అమలు చేసిన పక్షంలో 2003 లో మాదిరి బీజేపీ మళ్ళీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఉమా భారతి పేర్కొన్నారు.
ఆమె హెచ్చరికపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. తమ ప్రభుత్వం ప్రకటించనున్న కొత్త మద్యం పాలసీ .. మద్యాన్ని ప్రోత్సహించేదిగా ఉండబోదన్నారు. ఉమా భారతి వంటివారు ఈ సమాజానికి చేస్తున్న సేవలు నిరుపమానవైనన్నారు.