అగ్రరాజ్యం అమెరికా ఇండియాలో జరుగుతున్న రైతు ఉద్యమంపై స్పందించింది. రైతుల ఉద్యమం, ఆందోళనలను స్వాగతించిన అమెరికా విదేశాంగ శాఖ… ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతమైన నిరసనలకు అవకాశం ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని కామెంట్ చేసింది.
అయితే, విస్తృత ఓపెన్ మార్కెట్ కల్పించేందుకు కేంద్రం తెచ్చిన చట్టాలను సైతం సమర్థించింది. ఇలాంటి సమయంలో ఉత్పన్నమైన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, చర్చలే అన్నింటికి పరిష్కారం అంటూ సూచించింది.
భారత్ లో శాంతియుత నిరసనలు చేస్తున్న రైతుల పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయంటూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్ చేశారు. ఇందులో అమెరికన్లు కూడా ఉన్నారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ… ఇది కొన్ని సముహాలు, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు మాత్రమేనంటూ ప్రకటన జారీ చేసింది. భారత పార్లమెంటులో విస్తృతంగా చర్చించిన తర్వాతే చట్టాలు తయారు చేశామని, రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని తెలిపింది.