అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. చైనీస్ అప్లికేషన్స్ టిక్‌టాక్, వీచాట్ నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న 45 రోజుల్లోగా ఈ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు.
టిక్‌టాక్ కొనుగోలుపై అమెరికన్ కంపెనీలు.. ఈ 45 రోజల్లోగా ఆ సంస్థతో చర్చలు జరుపుకోవాలని గడువును విధించారు ట్రంప్. ఆ తర్వాత టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌తో ఎలాంటి లావాదేవీలు నిర్వహించబోరాదని వార్నింగ్ ఇచ్చారు. వీచాట్ మాతృసంస్థ అయిన టెన్‌సెంట్‌కు కూడా ఇదే వర్తిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.
జాతీయ భద్రత, రక్షణకై టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇండియాలో ఇప్పటికే ఈ యాప్స్‌ను బ్యాన్ చేసిన విషయాన్ని అందులో ప్రస్తావించారు.