అమెరికాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి మునుపటితో పోలిస్తే వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టినట్టు చెప్తున్నప్పటికీ.. అమెరికాను మాత్రం వైరస్ పట్టిపీడిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఏకంగా 9 లక్షల మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ కరోనా కారణంగా ఇన్ని మరణాలు వెలుగుచూడలేదని అధికారులు చెప్తున్నారు.
అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో రష్యా, బ్రెజిల్, ఇండియాలు ఉన్నాయి. ఈ దేశాల్లో 1.8 మిలియన్ల మందికిపైగా మరణించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. నిన్నమొన్నటి వరకు కుదిపేసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో యూఎస్ లో మరణాల రేటు క్రమంగా తగ్గుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం.
వైరస్ ప్రభావం ఉద్ధృతంగా ఉన్న సమయంలో 2,674 ఉన్న వారపు సగటు.. ఇప్పుడు వరుసగా రెండు రోజులపాటు 2,592కు తగ్గింది. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. హార్ట్ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు కొవిడ్ టీకా రెండు డోసుల మధ్య ఉండే దూరాన్ని 8 వారాలకు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రెండు డోసుల మధ్య దూరం నాలుగు వారాలుగా ఉంది. మరోవైపు.. భవిష్యత్తులో మరిన్ని పెద్ద వేవ్ లు తప్పవని కొవిడ్ మహమ్మారిని అంచనా వేసే యూకే అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు కాలంలో రాబోయే వేవ్ లను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.