సెప్టెంబర్ 11 దాడులు.. ఆధునిక ప్రపంచ గతినే మార్చేశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా, ఇతర పాశ్చత్య దేశాల విధానాలు పూర్తిగా మారిపోయాయి. ఉగ్రవాద నిర్మూలన కోసం అగ్రరాజ్యం అనుసరించిన విధానాలతో.. ఉగ్రవాదుల అంతం సంగతేమోగానీ.. సగటు అమెరికా పౌరుల్లో ఆసియన్ దేశాల పట్ల శత్రుత్వ భావన ఏర్పడింది. ముఖ్యంగా ఇస్లామోఫోబియాను వారిలో పెంచింది. విద్వేష దాడులు పెట్రేగిపోయాయి. భారత సంతతికి చెందిన ఓ సిక్కు వ్యక్తిని కూడా చంపేశారు. ఇక దాడుల తర్వాత అమెరికా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో భద్రతను భారీగా పెంచారు. ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి.
ఉగ్రవాదంపై పోరాటం, నిర్మూలనలో భాగంగా అప్పటికి అమెరికా అధ్యక్షుడు బుష్.. అమెరికా దేశభక్తి ( USA PATRIOT Act) చట్టాన్ని ఆమోదించారు. పౌరులపై నిఘా పెంచేందుకు అనుమతి ఇచ్చిన ఈ చట్టంతో అప్పట్లో దాడులు బాగా పెరిగిపోయాయి. ఎవరిపై అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నించేవారు. హింసించేవారు. ఈ చట్టంపై వ్యతిరేకత ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
అదే ఏడాది నవంబర్‌లో బుష్ ప్రభుత్వం డిపార్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసమే ప్రత్యేకంగా దీన్ని సృష్టించారు. దేశంలోని భద్రతా సంస్థలన్నింటిని దీని పర్యవేక్షణలోకి తీసుకెళ్లింది. అయితే ఈ విభాగం ఉగ్రవాద నిర్మూలన చర్యల కంటే.. ఎక్కువగా సరిహద్దుల్లో భద్రత, ఇమ్మిగ్రేషన్ కార్యకాలపాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. సెప్టెంబర్ 11 డాడుల తర్వాత అమెరికా సీఐఏ.. రహస్య నిర్బంధ ప్రాంతాలను ఏర్పాటు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అల్‌ఖైదా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానం ఉన్న వారిని అనధికారికంగా అరెస్ట్ చేసి.. వారిని నిర్బంధించి తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకునేవారన్న విమర్శలు ఉన్నాయి.
సెప్టెంబర్ 11 దాడులకు అల్‌ఖైదానే కారణమని నిర్ధారణకు వచ్చిన అమెరికా.. ఆపై ప్రతీకారంతో రగిలిపోయింది. ఆపై ఆప్ఘాన్‌ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టి, ఒసామా బిన్‌లాడెన్ కోసం తీవ్రంగా అన్వేషించింది. అమెరికా దూకుడును చూసి, సెప్టెంబర్ 11 దాడులకు సంబంధం లేదని తొలుత ప్రకటించుకున్నాడు లాడెన్. కానీ ఆ దాడులకు కారణం తానేనని లాడెన్ మాట్లాడిన వీడియోలు బయటపడటంతో.. అమెరికా మరింత రెచ్చిపోయింది. పాకిస్థాన్‌లోని అబ్బోట్టాబాద్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్‌లో హతం చేసింది.
ఉగ్రవాదంపై అమెరికా మొదలుపెట్టిన దాడి.. అటు, ఆప్ఘాన్, ఇటు ఇరాక్‌పై యుద్ధాలు చేసేవరకూ దారితీసింది. అమెరికా చర్యలు అనేక తీవ్ర విమర్శలకు దారితీసినప్పటికీ.. అల్‌ఖైదాకు చెందిన ముఖ్య నేతలను మాత్రం వారి సైన్యం మట్టుబెట్టడంలో విజయవంతమైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్‌కు జరిగిన మేలు ఏమిటంటే.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందన్న విషయం ప్రపంచదేశాలకు తెలిసింది.