అమెరికా పట్ల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కీలక నిర్ణయాన్ని తీసుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొత్తగా ఖడాంతర బాలిస్టిక్ క్షిపణులను, పెద్ద అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని ఉత్తర కొరియా అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చారు.
అయితే ఈ మధ్య కాలంలో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అధికార వర్కర్స్ పార్టీ సమావేశంలో ఉత్తర కొరియా సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకోవడానికి అధిక సైనిక శక్తి ఉండాల్సిన అవసరాన్ని కిమ్ జోంగ్ ఉన్ నొక్కి చెప్పారు. ఉత్తర కొరియా అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు కిమ్.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వరుసగా క్షిపణి ప్రయోగాలను చేపడుతున్నారు. శనివారం మూడు క్షిపణులను ప్రయోగించిన నార్త్ కొరియా, న్యూ ఇయర్ తొలి రోజు మరో క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల అమెరికా సైనిక విన్యాసాలు చేసింది. దీంతో అంతే ధీటుగా నార్త్ కొరియా కూడా సిద్ధం అవుతుంది.
దక్షిణ కొరియా మా శత్రువు అని కిమ్ అన్నారు. శత్రవుల నుంచి ఎదురయ్యే అణు ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే ఉత్తరకొరియా 2022 లో ఎక్కువగా క్షిపణులను ప్రయోగించిన దేశంగా నిలిచింది.