రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అమెరికన్ మ్యాగజైన్ న్యూ లైన్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఆయన బ్లడ్ క్యాన్సర్ లాంటి వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మ్యాగజైన్ తెలిపింది.
రష్యన్ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పేర్కొంది. ఆ వ్యక్తి ఓ వ్యాపారవేత్తతో సంభాషించిన సమయంలో ఈ విషయాలను తెలిపినట్టు న్యూ లైన్స్ చెప్పింది.
ఇదే సమయంలో బ్రిటన్ మాజీ గూఢచారి ఒకరు ఇదే విషయాన్ని వెల్లడించారు. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టోపర్ స్టీలే వివరించినట్టు స్కై న్యూస్ వెల్లడించింది.
‘రష్యా, ఇతర ప్రాంతాల్లో పలు వర్గాల నుంచి మాకు సమాచారం వస్తోంది. దాని ప్రకారం, పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు’అని స్టీలే పేర్కొన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై స్టీల్ గతంలో ఒక ఆర్టికల్ కూడా రాశారు.