ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అభిశంసన వీగిపోయింది. రిపబ్లికన్ల మద్దతుతో అభిశంసన నుంచి ట్రంప్ కు విముక్తి లభించింది. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ ను అడ్డుకోవడం అనే రెండు అభియోగాలతో ట్రంప్ పై విచారణకు అమెరికా సెనేట్ నిరాకరించింది. రెండు అభియోగాలపై విచారించేందుకు సెనేట్ లోని మెజార్టీ సభ్యులు అంగీకారం తెలపలేదు. సెనేట్ లో మెజార్టీ సభ్యులు రిపబ్లికన్లు ఉండడంతో అభిశంసన నుంచి తేలిగ్గా బయటపడ్డారు.
అంతకు ముందు ప్రతినిధుల సభ ట్రంప్ పై అభిశంసనకు అమోదం తెలిపింది. దీంతో అది సెనేట్ కు వెళ్లింది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అక్కడ ఆమోదం లభించింది.2020లో అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాల్సిందిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారన్నది డెమొక్రాట్ల ప్రధాన ఆరోపణ. దీంతో స్పీకర్ నాన్సీ పెలోసీ విచారణకు ఆదేశించింది. అభిశంసన విచారణను సెనేట్‌కు పంపే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జరిగిన ఓటింగ్‌లో 228 మంది సభ్యులకుగానూ 193 మంది ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే, సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండడంతో అభింశంసన నుంచి ట్రంప్ బయటపడ్డారు.
డెమోక్రాట్ల చర్యను వెట్ హౌస్ మీడియా కార్యదర్శి స్టీపెన్ గ్రిషమ్ నిరాధార చర్యగా తప్పుపట్టారు. నిరాధార ఆరోపణలతో డెమోక్రట్లు లేనిపోనివి ఆపాదించి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ట్రంప్ ప్రత్యర్థులు తీర్మానం ప్రవేశపెట్టగా.. సెనేటర్లు తోసిపుచ్చారని పేర్కొన్నారు.