కరోనాతో ప్రపంచ దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మొదటి వేవ్ లో ప్రజలు ఎక్కువగా భయభ్రాంతులకు గురైనప్పటికీ.. అంతగా ప్రాణ నష్టం జరగలేదు. రెండవ వేవ్ లో లక్షల మందిప్రాణాలను హరించింది మహమ్మారి. ఇటు థర్డ్ వేవ్ లోనూ భారీగా ప్రజలకు వ్యాపించి కంగారుపెట్టించింది.
కాగా.. కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపై అమెరికా పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు.
ఈ పరిశోధనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. కోవిడ్ సోకి ఆస్పత్రిలో చేరినవారితో పాటు.. మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్ అక్యూట్ సీక్వెలే ఆఫ్ కొవిడ్ గా పిలిచే ‘లాంగ్ కోవిడ్’ ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆ పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ తో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నవారిలో అధికశాతం అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు.
దీర్ఘకాలం పాటు ఈ సమస్య వారిని వెంటాడినట్టు తేల్చారు. ఇక వాసన గుర్తించలేని పరిస్థితి 16 శాతం మందిలో కనిపించిందని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో మొత్తం 1,038 మంది పరిస్థితులను పరిశీలించినట్టు వెల్లడించారు పరిశోధకులు. వీరిలో 309 మందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలను గుర్తించామన్నారు.