జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. ఓటర్ల జాబితాలో కొత్తగా 5 లక్షలమందికి పైగా ఓటర్లు చేరారు. ఈ ఏడాది అక్టోబరు 1 న న ప్రత్యేకంగా సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం కొత్త ఓటర్ల పేర్లను ఇందులో చేర్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2019 లో చివరిసారి ఈ జాబితాను సవరించారు. అప్పుడు లడఖ్ కు చెందిన 1.8 లక్షల మంది ఓటర్ల పేర్లను కూడా ఇందులో చేర్చారు.
శుక్రవారం ప్రచురించిన సవరించిన రోల్స్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం 83 లక్షల 59 వేల 774 మంది ఓటర్లు ఉన్నారు. అంటే కొత్తగా 5.1 లక్షల మంది ఈ లిస్ట్ లో చేరారు. నియోజకవర్గాల పునర్వర్గీకరణ అనంతరం ఈ సంఖ్య పెరిగిందని ఈ వర్గాలు వివరించాయి.
కొత్తగా ప్రచురించిన ఓటర్ల జాబితా .. ఇక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గాన్ని సుగమం చేస్తోందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని కోరుతున్నప్పటికీ శీతాకాలం దృష్ట్యా వచ్చే ఏడాది మార్చి లోగా ఎన్నికల నిర్వహణకు అవకాశం లేకపోవచ్చునని అంటున్నారు.
జమ్మూ కశ్మీర్ చరిత్రలో మొదటిసారిగా ఒకేసారి ప్రత్యేకంగా సవరించిన జాబితాలో 11 లక్షలమందికి పైగా ఓటర్ల పేర్లను చేర్చారు. 18, 19 ఏళ్ళ మధ్య వయస్సుగల ఓటర్లు 3 లక్షలమందికి పైగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల పేర్లను జాబితాలో చేర్చాలని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరుతున్నారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఈసీ ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.