అణు యుద్దానికి తాము సిద్ధమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని మోడీ మంగళవారం ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్స్కీ తో ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత యుద్ధ వాతావరణానికి మిలిటరీ పరిష్కారం కాదని , సాధ్యమైనంత త్వరగా వైషమ్యాలకు స్వస్తి చెప్పి శాంతి కోసం దౌత్యపరమైన చర్చలకు కూచోవాలని ఆయన కోరారు.
అణ్వస్త్రాల మోహరింపు తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందన్నారు. మీ దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూసే ప్రయత్నాలకు తన వంతు కృషి చేయడానికి ఇండియా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఐరాస నియమావళిని, అంతర్జాతీయ చట్టాలను, అన్ని దేశాల సార్వభౌమాధికారాలను గౌరవించవలసిన అవసరం ఉందన్నారు.
మీ దేశంతో బాటు అన్ని దేశాల్లోని అణు కేంద్రాల భద్రతకు ఇండియా అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మోడీ తెలిపారు. అణు యుద్ధం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఏర్పడుతాయని, ప్రజల,ఆరోగ్యానికి హాని, పర్యావరణం దెబ్బ తింటుందని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో తాము న్యూక్లియర్ వార్ కైనా సిద్ధమని పుతిన్ ఇటీవల హెచ్చరించారు. పైగా ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్టు ఆయన ప్రకటించారు. అణు యుద్ధం మంచిది కాదని, శాంతి నెలకొనేందుకు దౌత్యపరమైన చర్చలను ప్రారంభించాలని మోడీ.. ఆయనను కూడా కోరి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.