ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో చేరడానికి ముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతల జాబితాను ఆయన షేర్ చేశారు. అవినీతి గురించి ‘నేను తినను, మరొకరిని తిననివ్వను’అన్న ప్రధాని మాటలను ఆయన గుర్తు చేశారు.
‘నేను తినను-మరొకరు తిననివ్వను’ అన్న ప్రధాని మాటలకు అర్థం ఏమిటని తాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని థరూర్ అన్నారు. బహుశా ప్రధాని మోడీ బీఫ్(గో మాంసం) గురించి మాట్లాడుతున్నారని తాను ఊహిస్తున్నంటూ సెటైర్లు వేశారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నేతల పేర్లను థరూర్ షేర్ చేశారు. వారిలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీలోకి చేరిన సువేందు అధికారి, భావనా గౌలీ, యశ్వంత్ జాదవ్, యామినీ యాదవ్, ప్రతాప్ సర్ నాయక్, నారాయణ్ రాణే పేర్లు ఉన్నాయి.
ఇటీవల గౌతమ్ అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా మోడీ నినాదాన్ని గుర్తు చేశారు. తాను తినను- మరొకరిని తిన నివ్వనని మోడీ అన్నారని, అదంతా జుమ్లానా? అని ఆయన ప్రశ్నించారు.