ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చైనా, పాకిస్తాన్‌లు కలిసి రష్యాకు మద్దతు పలుకుతన్నాయంటూ పలు వార్తలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మక తప్పిదాలను చేస్తో్ందని, దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.
గతంలోనూ మోడీ సర్కార్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై తీవ్ర స్థాయిలో రాహుల్ విమర్శలు చేశారు. చైనా, పాకిస్తాన్‌లను ఏకం చేసేలా కేంద్రం తీరు ఉందంటూ గత నెలలో విరుచుకు పడ్డారు.
ఈ ప్రభుత్వంలో రెండు భారతదేశాలు ఏర్పడ్డాయని, ఒకటి ధనికుల కోసం, మరొకటి పేదల కోసం అని రాహుల్ గతంలో ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.