వి.ఎస్. సూర్య ప్రకాశ రావు
రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, అప్రజాస్వామికంగా హిందీ భాషని దక్షిణాది మీద రుద్దడానికి ఢిల్లీ పాలకులు 1960లలోనే గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తమిళనాడు ప్రజానీకం అంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ భాషా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. అనేకమంది ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ దేశంలో తల్లి భాష కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన మహనీయులు తమిళులలో మాత్రమే ఉన్నారనేది తిరుగులేని నిజం.
పెరియార్, అన్నాదురై, శివజ్ఞాన గ్రామణి, ఆదిత్యనార్ వంటి నాయకులు, తమిళ భాషాకోవిదులు, ద్రావిడ కళగం, ద్రావిడ మున్నేట్ర కళగం, తమిళ అరసు కళగం, నామ్ తమిళర్ ఉద్యమం అలుపులేని పోరాటం చేసినందువల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి హిందీని మన నెత్తినరుద్దే ప్రయత్నాన్ని విరమించుకుంది. ఈ మహత్తర పోరాటంలో తమిళనాడుకు అండగా మిగిలిన దక్షిణ రాష్ట్రాలు నిలబడలేదనేది వాస్తవం. తమిళుల మాతృభాషాభిమానం ఎంత బలవత్తరమైనదంటే ఉద్యమ క్రమంలో వచ్చిన 1967 ఎన్నికల్లో కామరాజ్ లాంటి రాజకీయ దిగ్గజం సైతం ఘోరంగా పరాజయం పొందడమే కాదు. తిరిగి ఏభై ఏళ్ల తర్వాత ఈ నాటివరకూ కాంగ్రెస్ కోలుకోలేకపోయింది.
రెండేళ్ళక్రితం బీజేపీ ప్రభుత్వం ఈ హిందీ రుద్దుడును సూచనప్రాయంగా బయటపెట్టడంతో కర్ణాటకలో అక్కడక్కడ నిరసనలు కనిపించాయి. కేరళ, ఉమ్మడి ఏపీ పట్టించుకోలేదు. అసలు ఈ హిందీ అనేది ఈ మధ్యకాలంలో రూపుదిద్దుకున్న భాష. నిజానికి హిందీ మాతృభాషగా చెప్పుకునే వారు తమ ఇళ్లలో మాట్లాడుకునేది బ్రజ్ భాష లేక అవధి లేక భోజపురి లేక మైథిలి లేక ఛత్తీస్‌గడీ లేక మాగధి లేక హరియాణవీ లేక మార్వాడీ కావచ్చు. ఖడీబోలీ అనే భాషని మాత్రం స్టాండర్డ్ హిందీగా పరిగణించవచ్చు. హిందీ పరిణతి చెందిన భాష కాదు. శాస్త్ర సాంకేతిక పదకోశo హిందీలో ఏర్పడలేదు. ఒకవేళ ఏర్పడినా అది పిల్లిని మార్జాలం అని వ్యవహరించినట్టే ఉంటుంది. అంటే మనకి సైన్స్ ఆంగ్లభాషలోనే సులువుగా అర్థం అవుతుంది. ఇంకొక విషయం. మున్షీ ప్రేమ్ చంద్, క్రిషన్ చందర్, రాజేంద్ర క్రిషన్, శైలేంద్ర, గుల్జార్ లాంటివారు ఉర్దూ భాషలో రచనలు చేసేవారు, చేస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఉర్దూ చాలా సంపన్నమైన భాష.
భాష సంపన్నత విషయంలోగాని, సాహితీ సంపద విషయంలోగాని ఉర్దూతో హిందీని పోల్చడం సాధ్యంకాదు. ఉర్దూ ఫలాని మతానికి చెందిన భాష అని భావించే వారికి ఓ నమస్కారం. నిజానికి ఉర్దూ భారతీయ భాష. పైగా ఉర్దూ పుట్టింది దక్కన్‌లోనే. ఇప్పుడు అసలు సంగతికి వద్దాం. సర్కారు వైఫల్యాల వల్ల జనజీవనంలో సంక్షోభం ఏర్పడినప్పుడల్లా ఏదో విషయం మీద భారీగా హడావిడి చేసి, జనం దృష్టిని మళ్లించి, ఆ అంశంమీద జనం ఆందోళన పడి, ఉద్యమాలు చేస్తూ అసలు సమస్యని మర్చిపోయేలా చెయ్యడం పాలకులు ఎవరైనా చిరకాలం అవలంబిస్తున్న తెలివైన ఎత్తుగడ. ఇప్పుడు అమిత్ షా ప్రకటన లక్ష్యం కూడా అదే.
ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు లవ్ జిహాద్, అయోధ్య. తర్వాత గోరక్షణ. ఇప్పుడు సెక్షన్ 370 తర్వాత తలెత్తిన పరిణామాలనుంచి, దిగజారుతున్న జీ.డీ.పీ. నుంచీ, మున్నెన్నడూలేని ఆర్థిక సంక్షోభం నుంచీ జనం దృష్టిని మరల్చాలంటే ఏదో ఒక సంచలనం రావాలి. అది ప్రస్తుతానికి హిందీ. ఈ చర్చ ఎంత లోతుగా నడిస్తే సర్కారుకు అంత మంచిది. ఏదీ లేకపోతే మనకి అయోధ్య, గోవులాంటివి ఎలాగూ ఉంటాయి.