జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 83వ రైజింగ్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
సీఆర్పీఎఫ్ రైజింగ్ డే వేడుకలు దేశ రాజధాని వెలుపల జరగడం ఇదే తొలిసారి. 1950లో చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా వేడుకల్ని ఢిల్లీలో నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ.. ఈసారి మాత్రం జమ్మూలో జరిపారు.
జవాన్ల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత మాట్లాడిన అమిత్ షా… దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంలో సీఆర్పీఎఫ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదం నియంత్రణలో ఉందంటే అది మన బలగాలు సాధించిన అతిపెద్ద విజయమని చెప్పారు.
2014లో మోడీ ప్రధాని అయ్యాక జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు షా. ఇక కార్యక్రమంలో భాగంగా వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ సిబ్బంది, సైనికుల కుటుంబాలకు పతకాలు, అవార్డులను అందజేశారు.